సీతా మహాలక్ష్మి ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్ల. సొంతంగా తన కాళ్ళమీద నిలబడాలని వ్యాపారం చేస్తుంటుంది కానీ అతి కష్టమ్మీద నెట్టుకొస్తుంటుంది. ఒక వైపు తల్లిదండ్రులు చూస్తున్న పెళ్ళి సంబంధాలు కూడా ఏదో ఒక కారణంతో తిరగ్గొడుతూ ఉంటుంది. రామ్ అమెరికాలో ఎమ్మెస్ చదివి వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే అమ్మమ్మ, మామయ్య దగ్గర పెరుగుతాడు. మరదలు రాజీ అంటే రాముకి అభిమానం. కానీ మేనల్లుడు ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడని అతనికి పిల్లనివ్వడానికి మేనమామ అంగీకరించడు. రాజీకి ఐపీఎస్ అధికారి అయిన రవీంద్రతో పెళ్ళి నిశ్చయం అవుతుంది. రాజీ కూడా బావను కాదని రవీంద్ర వైపే మొగ్గు చూపుతుంది. అందరూ కలిసి పడవలో గోదావరి నది మీద భద్రాచలం ప్రయాణమవుతారు. పెళ్ళి సంబంధం కుదరకపోవడంతో సీత కూడా అదే పడవలో బయలు దేరుతుంది. అక్కడ రాము పద్ధతిని చూసి అతన్ని అభిమానించడం మొదలుపెడుతుంది. రాజీ మీద అతనికున్న అభిమానాన్ని తెలుసుకుంటుంది కానీ అతని వ్యక్తిత్వానికి ఆమె సరిపోదని, తానే అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది. కొన్ని పరిస్థితుల్లో రవీంద్ర ధోరణిని గమనించిన రాజీ, మళ్ళీ రామునే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. రాము ఒప్పుకుంటున్నట్లుగా నటించి సీతను తాను ఒక చోటుకి తీసుకురమ్మని చెబుతాడు. కానీ రాము మాత్రం అక్కడికి రాడు. రాజీ రవీంద్రనే పెళ్ళి చేసుకుంటానని మనసు మార్చుకుంటుంది. సీత మాత్రం రాము మనసులో తాను లేనని తెలుసుకుని తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతుంది. రాము సీత పడవలో మరిచిపోయిన డైరీ చదివి ఆమె తనను ప్రేమించిన విషయం తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్ళి తన ప్రేమను వ్యక్తం చేయడంతో కథ సుఖాంతం అవుతుంది.
IMDb రేటింగ్: 7.9/10

Showing the single result