soothravakyam ott: మలయాళంలో మెప్పించి.. ఇప్పుడు ఓటీటీలో షైన్‌ టామ్‌ చాకో ‘సూత్రవాక్యం’

ఇంటర్నెట్‌డెస్క్‌: షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోర్ కీలక పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘సూత్రవాక్యం’. ఇటీవల మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు ఓటీటీ వేదికగా (soothravakyam ott) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో (ETV Win) ఆగస్టు 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్‌ పోస్టర్‌ను పంచుకుంది.

పోలీస్‌స్టేషన్స్‌కు నేరాలు చేసినవాళ్లు, సదరు నేరాలకు బలైన బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలి? ఖాళీ సమయాల్లో పోలీసు సిబ్బంది పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? పోలీసుల్ని చూసి భయపడే సంస్కృతి ఇంకా ఎందుకు కొనసాగాలనే విప్లవాత్మకమైన ఆలోచనకు.. చక్కటి వినోదం జోడించి  ‘సూత్రవాక్యం’ రూపొందించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.

ఇంతకీ కథేంటంటే..

క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) పోలీస్‌ అధికారి. కేవలం తన విధులు నిర్వర్తించడమే కాదు, పిల్లలకు పాఠాలు కూడా చెబుతాడు. స్కూల్‌కు వెళ్లకుండా కేవలం అతని పాఠాలు వినడానికే పిల్లలు వస్తుండటంతో స్కూల్ టీచర్ నిమిషా (విన్సీ) దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంది. మరోవైపు క్రిస్టో ట్యూషన్‌కు వచ్చే ఆర్య (అనఘా) అనే అమ్మాయిపై ఆమె సోదరుడు వివేక్ (దీపక్ పరంబోల్) చెయ్యి చేసుకుంటాడు. విషయం తెలిసి క్రిస్టో అతడిని హెచ్చరిస్తాడు. ట్యూషన్‌కు వచ్చే మరో అబ్బాయి అఖిల్ (నసీఫ్ పీపీ)తో చెల్లెలు స్నేహంగా ఉండటం చూసి వివేక్‌ సహించలేకపోతాడు. ఆర్య, ఆమె బాయ్ ఫ్రెండ్ అఖిల్… ఇద్దరిపైనా దాడి చేస్తాడు. ఈ ఘటన జరిగిన తర్వాత ఊళ్లో కనిపించడు. ఇంతకీ వివేక్‌ ఏమయ్యాడు? అతడి ఆచూకీ తెలుసుకోవాలని క్రిస్టో జేవియర్ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో మరో మర్డర్ కేసు ఎలా బయట పడింది? మరణించిన అమ్మాయి ఎవరు? వివేక్ కేసుతో ఆమెకు సంబంధం ఉందా? ఈ మిస్సింగ్, మర్డర్ కేసుల్లో దోషులను క్రిస్టో జేవియర్ ఎలా పట్టుకున్నాడు?అన్నది చిత్ర కథ.

సౌజన్యం : ఈనాడు లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *