Anuparna Roy becomes the first Indian director to win an award in the Orizonti category at the Venice Film Festival
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ (Venice Film Festival 2025)లో అనుపర్ణ రాయ్ (Anuparna Roy) రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో అవార్డు అందుకున్న తొలి భారతీయ డైరెక్టర్‌గా నిలిచారు. ‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’ (Songs of Forgotten Trees) చిత్రానికిగానూ అనుపర్ణకు పురస్కారం దక్కింది. తొలి సినిమాకే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు పొందడం విశేషం. ఒరిజోంటి సెక్షన్‌కు భారత్ నుంచి ఎంట్రీ పొందిన ఏకైక సినిమా కావడం గమనార్హం. 1949 నుంచి ‘గోల్డెన్ లయన్’ పేరిట విజేతలకు పురస్కారాల్ని అందిస్తున్నారు. కొత్త ప్రతిభను, ఇండిపెండెంట్ చిత్రాలను ప్రోత్సహించేందుకు దానికి సమానమైన ఒరిజోంటి అవార్డును 20 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ఆగస్టు 27న మొదలై సెప్టెంబరు 6న ముగిసిన ఈ ఫెస్టివల్‌లో హాలీవుడ్ మూవీ ‘ఫాదర్ మదర్ సిస్టర్ మదర్’ ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లయన్ అవార్డు దక్కించుకుంది.
ఇలాంటి కథలు మరిన్ని తెరకెక్కించేందుకు ఈ విజయం స్ఫూర్తినిస్తుందని అన్నారు. షార్ట్‌ఫిల్మ్ ‘రన్ టు ది రివర్’తో 2023లో అస్టిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు అనుపర్ణ. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఆ లఘు చిత్రానికి ప్రశంసలు దక్కాయి. ముంబయిలో ఉద్యోగం చేస్తూనే ‘సాంగ్స్ ఆఫ్ ఫర్‌గాటెన్ ట్రీస్’ రూపొందించారు. ముంబయికి వలస వెళ్లిన ఇద్దరు మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారన్న అంశంతో తెరకెక్కిన చిత్రమిది.
సౌజన్యం : ఈనాడు
