
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ పవన్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Hari Hara Veera Mallu Ott Platform) వేదికగా, ఆగస్టు 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘హరి హర వీరమల్లు’ టీమ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు. ‘పార్ట్-1 స్వోర్డ్ అండ్ స్పిరిట్’ జులై 24న విడుదలైంది. రెండో భాగానికి సంబంధించి కొంత షూట్ పూర్తయినట్లు తెలుస్తోంది. బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇంతకీ కథేంటంటే..
16వ శతాబ్దంలో మొదలయ్యే కథ ఇది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (బాబీ దేవోల్) దిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాగతాలకి పాల్పడుతూ పాలన కొనసాగిస్తుంటాడు. మత మార్పిడి కోసం దేశ ప్రజలని బలవంతం చేస్తుంటాడు. అందుకు ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించేవాళ్ల నుంచి జిజియా పన్ను వసూలు చేస్తుంటాడు. మరోపక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా, వాళ్లని పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరలు దోచుకెళ్తుంటారు. వాళ్లకు అనుకూలంగా కొద్దిమంది రాజులు, వాళ్ల అనుచరులు పనిచేస్తూ ఉంటారు. వాళ్లందరికీ వీర మల్లు (పవన్ కల్యాణ్) అంటే హడల్. పెద్దవాళ్ల దగ్గరున్న సంపదని దోపిడీ చేసి పేదలకి పంచిపెడుతుంటాడు. బందరు నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహీ దగ్గరకు తీసుకెళుతున్న వజ్రాలపై కన్నేస్తాడు వీరమల్లు. తన బలగంతో చార్మినార్ వరకూ వచ్చి మరీ వజ్రాల్ని కాజేస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ దిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని అతడికి అప్పజెబుతాడు. ఏ కారణాలతో అందుకు వీరమల్లు ఒప్పుకున్నాడు?హైదరాబాద్ నుంచి దిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకి ఎదురైన పరిస్థితులు ఎలాంటివి?ఈ కథలో పంచమి (నిధి అగర్వాల్) ఎవరు?ఆమెకీ వీరమల్లుకూ సంబంధం ఏమిటి?శత్రుదుర్బేధ్యమైన ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్లాడు?అన్నది చిత్ర కథ.


