బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిన ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narsimha) ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. తెలుగు సహా పలు భాషల్లో ‘నెట్ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 19న మధ్యాహ్నం 12:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. రూ.40 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 8 రోజుల్లోనే రూ.60.5 కోట్లు వసూలు చేసింది. తక్కువ సమయంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ యానిమేషన్ సినిమాగా రికార్డు సృష్టించింది. 50 రోజులకుపైగా థియేటర్లలో ప్రదర్శితమై, రూ.300 కోట్లకుపైగా కలెక్ట్ చేయడం మరో రికార్డు. యానిమేషన్ మూవీ అంటే పిల్లల కోసమని ఫిక్స్ అయ్యే చాలామంది అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది ‘మహావతార్ నరసింహ’.

